త్వరలో ఈవినింగ్ కోర్టులు !!

దేశంలో పెండింగ్ కేసుల పరిష్కారానికి కేంద్రం కీలక నిర్ణయం
దేశవ్యాప్తంగా కోర్టుల్లో పేరుకుపోతున్న పెండింగ్ కేసుల పరిష్కారానికి చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలకమైన ముందడుగు వేసింది.న్యాయస్థానాలపై విపరీతంగా పెరిగిపోతున్న భారాన్ని తగ్గించి, సామాన్యులకు సత్వర న్యాయం అందించే లక్ష్యంతో ఈవెనింగ్ కోర్టుల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ అధికారికంగా వివరాలను వెల్లడించారు. ఈ ఈవినింగ్ కోర్టులు మొదట మూడు రాష్ట్రాల్లో పైలట్ ప్రాజెక్ట్ గా ప్రారంభం కానున్నాయి. ఢిల్లీ, బీహార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ ఈవెనింగ్ కోర్టులను ప్రారంభించేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తోంది. సంబంధిత హైకోర్టుల పూర్తి సహకారంతో ఈ ప్రక్రియ త్వరలోనే క్షేత్రస్థాయిలో ప్రారంభం కానుంది.
ఈవినింగ్ కోర్టుల ప్రత్యేకతలు నిర్వహణ విధానం
సాధారణంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు పనిచేసే కోర్టులు, ఇకపై అదనంగా సాయంత్రం వేళల్లోనూ కొన్ని గంటలపాటు పనిచేస్తాయి. సాయంత్రం జరిగే ఈ కోర్టు కార్యకలాపాల సమర్థవంతమైన నిర్వహణ కోసం అనుభవజ్ఞులైన రిటైర్డ్ న్యాయమూర్తుల సేవలను వినియోగించుకోవాలని కేంద్రం యోచిస్తోంది. ముఖ్యంగా కాలం చెల్లిన, సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసుల విచారణ, త్వరితగతిన పరిష్కారంపై ఈ ఈవినింగ్ కోర్టులు ప్రత్యేకంగా దృష్టి సారించనున్నాయి.ఈ ఈవినింగ్ కోర్టుల తొలిదశ ప్రయోగం యొక్క పనితీరును కేంద్ర ప్రభుత్వం సమగ్రంగా సమీక్షించనుంది. ఈ పైలట్ ప్రాజెక్ట్ విజయవంతమైనట్లయితే, రాబోయే రోజుల్లో దేశంలోని ఇతర రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు కూడా ఈ ఈవెనింగ్ కోర్టులను విస్తరించనున్నారు.అంతేకాకుండా, కోర్టులపై భారాన్ని మరింత తగ్గించేందుకు ఓంలోక్ అదాలత్ ల నిర్వహణకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు, ప్రత్యామ్నాయ వివాద పరిష్కార విధానాల (ADR - Alternative Dispute Resolution) ద్వారా కేసుల సంఖ్యను గణనీయంగా తగ్గించేందుకు తగిన చర్యలు చేపడుతున్నారు. తద్వారా కోర్టుల్లో జాప్యాన్ని నివారించి, ప్రజలకు సత్వర న్యాయాన్ని అందించడమే ప్రధాన ధ్యేయంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.





